కడప, సెప్టెంబరు 29: జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో చర్చించారు. మంగళవారం కడప కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత అధ్యక్షతన సమావేశం జరిగింది.
సమావేశంలో జిల్లాలో వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు. అనంతరం అజెండాలోని అంశాల వారీగా శాఖల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు, చేపట్టిన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బి. రాంగోపాల్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎన్. వరదరాజులరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ డా. నిధీమీనా, సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, డీఎఫ్‌ఓ గరుడ్ సంకేత్ సునీల్, డీఆర్‌ఓ మల్లికార్జునుడు, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.
ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. అభివృద్ధి పనుల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.



