ప్రొద్దుటూరు, ఆగస్టు 6: శ్రీ అగస్త్యేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన వినాయకనగర్‌లోని దేవాంగ కళ్యాణ మండపానికి తూర్పు భాగంలో ఉన్న సర్వే నంబర్ 431/B2లోని సుమారు 26 సెంట్ల స్థలాన్ని ఖాళీ చేయించాలని దేవస్థాన పాలకవర్గం నిర్ణయించింది.
ఇటీవల నిర్వహించిన భూ సర్వేలో ఈ స్థలం దేవస్థానానికి చెందినదేనని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ స్థలంలో కొంతమంది ఇళ్లు నిర్మించుకుని, రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కే.వి. రమణ, దేవస్థాన చైర్మన్ వంగల నారాయణ రెడ్డి, పాలకమండలి సభ్యులు స్థలాన్ని పరిశీలించి, దేవస్థాన ఆస్తులను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఆక్రమణదారులు స్థలాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించారు. నిబంధనల మేరకు సంబంధిత వారికి నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.



