ప్రొద్దుటూరు పట్టణంలోని రజకవాడ అంగన్వాడీ కేంద్రంలో సర్వోదయ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (ఎస్ఐఆర్డీఎస్) ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో వార్డు మాజీ కౌన్సిలర్ ద్వార్సల భారతి, వైద్యాధికారి డాక్టర్ కటారు మానస మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగనిరోధక శక్తిని అందిస్తాయని తెలిపారు. పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వడం, అనంతరం రెండేళ్ల వరకు అదనపు ఆహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. ఎస్ఐఆర్డీఎస్ అధ్యక్షుడు ఎం.వి. సుబ్బారెడ్డి ప్రతి తల్లి తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి శిశువు ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు హెల్త్ సెక్రటరీ రెబకా, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు



