పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రానికి అన్యాయమని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. శుక్రవారం వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేస్తే సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి అసలు లక్ష్యాలు పూర్తిగా నెరవేరవని అన్నారు. విభజన చట్టం, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరాన్ని పూర్తి స్థాయిలో నిర్మించేందుకు కేంద్రం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. విజయవాడలో వైఎస్సార్సీపీ నిరాహార దీక్ష శిబిరంపై జరిగిన దాడిని ఖండిస్తూ, ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తులసిరెడ్డి పేర్కొన్నారు.



