ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ శుక్రవారం భారీ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆధ్వర్యంలో 200 మంది మున్సిపల్ సిబ్బందిని 12 ప్రత్యేక బృందాలుగా విభజించి పట్టణంలోని సుమారు 10 వేల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సింగిల్-యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై వ్యాపారులకు అవగాహన కల్పించడంతో పాటు, వారి వద్ద ఉన్న నిషేధిత ప్లాస్టిక్‌ను స్వచ్ఛందంగా మున్సిపాలిటీకి అప్పగించేలా ప్రోత్సహించనున్నారు.
ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై వ్యాపారులకు వివరించి, వస్త్ర సంచులు, కాగితపు సంచులు వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సంకల్ప దీక్షలో వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కమిషనర్ కోరారు. ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రొద్దుటూరును నిర్మించగలమని ఆయన పేర్కొన్నారు.



