అన్నమయ్య జిల్లా పోలీసు శాఖలో విశేష సేవలందించిన పోలీసు జాగిలం ‘రాజా’ (ల్యాబ్రడార్) అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. వీఐపీ బందోబస్తు విధులు, పేలుడు పదార్థాల గుర్తింపు వంటి కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించి పోలీసు శాఖకు రాజా విశేష సేవలందించింది. రాయచోటిలోని పాత పోలీసు క్వార్టర్స్‌లో రాజా పార్థివ దేహానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజా అందించిన సేవలను ఆయన గుర్తుచేసుకుంటూ పోలీసు శాఖ తరఫున ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో రాజా అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, సీఐలు చలపతి, రోషన్, కృష్ణంరాజు నాయక్, చాంద్ బాషా, ఆర్ఐ (అడ్మిన్) యు. రంగనాథ్ బాబు, ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని రాజాకు కడసారి వీడ్కోలు పలికారు.



