ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాజకీయ కారణాలతో పారిశ్రామిక సంస్థలపై ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల పెట్టుబడులు తగ్గడంతో పాటు వేలాది మంది కార్మికుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
భారతి సిమెంట్‌కు ముడి సరుకు సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా కార్మికులు, అనుబంధ రంగాలపై ప్రభావం చూపే పరిస్థితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల విషయంలో ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిని విడిచిపెట్టి, అన్ని సంస్థలకు సమాన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఏ పరిశ్రమపైనా కక్షసాధింపు చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలను ప్రభుత్వం అమలు చేయాలని రాచమల్లు కోరారు.



