ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం తొలి రోజు ముగిశాయి. DSC అక్రమాలపై CBI విచారణ చేపట్టాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్షలు ప్రారంభమయ్యాయి.
తొలి రోజు దీక్షలకు ప్రొద్దుటూరు ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్ అధ్యక్షత వహించగా, సోములవారిపల్లె గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మారుతీ ప్రసాద్, ప్రొద్దుటూరు మండల కన్వీనర్ మార్తల ఓబుళరెడ్డి, వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెలవలి శేఖర్ రెడ్డి, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు పన్నీటి కాశయ్య తదితరులు దీక్షలో పాల్గొన్న వారికి కొబ్బరి నీరు, పండ్ల రసం అందించి తొలి రోజు దీక్షలను విరమింపజేశారు. తదుపరి రోజుల్లో కూడా ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.



