వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలంలోని గండి గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి అఖిలానందన్ను సైన్స్ ఉపాధ్యాయుడు జావిద్ తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దెబ్బల తీవ్రతను తట్టుకోలేక విద్యార్థి స్పృహ కోల్పోయినట్లు సమాచారం.
విద్యార్థి అస్వస్థతకు గురైన విషయం గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం వారు పాఠశాలకు చేరుకుని బాలుడి పరిస్థితిని పరిశీలించారు. ఘటన అనంతరం పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి రూ.5,000 నగదు అందజేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అలాగే విద్యార్థిపై దాడి జరిగిందన్న ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.



