ప్రొద్దుటూరు, ఆగస్టు 4: విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకుని బెదిరించిన కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు జరిమానా విధించింది. 2021లో నమోదైన ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ క్రైం నం.224/2021 కేసులో షైక్ హుస్సైన్, షైక్ అబ్దుల్ అలీమ్, షైక్ నాయబ్ రసూల్లపై ఆరోపణలు రుజువుకావడంతో ప్రథమ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ తరఫున సీనియర్ ఏపీపీ స్వప్న వాదనలు వినిపించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ టి.వి. కొండారెడ్డి హెచ్చరించారు.



