పులివెందుల, సెప్టెంబర్ 29: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జంతు, రసాయన శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార భద్రతపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ బి. శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. సురక్షితమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందరికీ అందుబాటులో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు అవగాహన కల్పించారు.
ఆహార కల్తీ, సూక్ష్మజీవుల కాలుష్యం, పురుగుమందుల అవశేషాలు, రసాయన కాలుష్యం, ఆహార వ్యర్థాలు, వాతావరణ మార్పుల ప్రభావం తదితర అంశాలపై చర్చించారు. జంతువుల నుంచి వ్యాపించే జూనోటిక్ వ్యాధుల నియంత్రణకు వ్యాధి పర్యవేక్షణ, ప్రయోగశాల పరీక్షలు, జంతు ఆరోగ్య పరిరక్షణ కీలకమని డాక్టర్ జి. దీపిక తెలిపారు. స్టింగ్లెస్ బీ తేనె ప్రత్యేకతలు, పాలు, మాంస ఉత్పత్తుల్లో సూక్ష్మజీవుల నియంత్రణపై డాక్టర్ మన్నూర్ ఇస్మాయిల్ షేక్, డాక్టర్ పి. జయమ్మ వివరించారు.
కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ యు. శ్రీనిత, కో-కన్వీనర్ వినోదమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకరయ్య, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



