ప్రొద్దుటూరు: పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన గోస్పాటి నారాయణమ్మ (75) మరణానంతరం ఆమె కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. మృతురాలి కుమారుడు చంద్ర ఓబుల్‌రెడ్డి, కోడలు కళావతి సమ్మతి తెలియజేయడంతో పులివెందుల స్నేహిత అమృతహస్తం సేవాసమితి నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ అరవింద్ మృతురాలి నివాసానికి చేరుకుని రెండు కార్నియాలను సేకరించారు.
అనంతరం సేకరించిన కార్నియాలను హైదరాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి తరలించినట్లు కేంద్రం అధ్యక్షుడు మొమ్మెల రాజు తెలిపారు. నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపు అందించే అవకాశం ఉందన్నారు. మరణానంతరం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
గోస్పాటి కుటుంబం గతంలోనూ సేవాభావాన్ని చాటుకుంది. నారాయణమ్మ భర్త, డీసీసీ బ్యాంక్ విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గోస్పాటి ఓబుల్‌రెడ్డి 2016లో మరణించినప్పుడు నేత్రదానంతో పాటు కడప రిమ్స్‌కు శరీరదానం చేసిన విషయాన్ని రాజు గుర్తుచేశారు. నారాయణమ్మ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని బంధువులు, సన్నిహితులు, స్నేహ సేవాసమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సభ్యులు అభినందించారు.



