ప్రొద్దుటూరు: పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు చెందిన ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో ‘కాఫీ విత్ కమిషనర్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు చెందిన డిగ్రీ, ఆపై ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థుల ఆశయాలు, ప్రతిభ, కెరీర్ లక్ష్యాలను తెలుసుకోవడంతో పాటు వారి భవిష్యత్తుకు అవసరమైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించనున్నారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో పాటు వారి విద్యాభ్యాసానికి సంబంధించిన సమస్యలను కూడా తెలుసుకుని నమోదు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఉన్నత విద్యలో విద్యార్థులు మరింత ముందుకు సాగేందుకు అవసరమైన సూచనలు, మార్గదర్శకత్వం అందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు.
పారిశుధ్య కార్మికుల పిల్లల విద్యా ప్రగతికి ప్రోత్సాహం అందించే ఈ కార్యక్రమానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించాలని కమిషనర్ కోరారు. గాంధీ జయంతి రోజున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల ఆశయాలు, సమస్యలను తెలుసుకునే వేదికగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.



