ప్రొద్దుటూరు: సర్వైకల్ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని గౌతమ్ హైస్కూల్‌లో యూపీహెచ్‌సీ టి.బి.రోడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ మానస పర్యవేక్షించారు. ఈ సందర్భంగా 27 మంది అర్హులైన పిల్లలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు వేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మానస మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు అర్హులైన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన పిల్లలకు టీకాలు వేయించాలని సూచించారు.
పాఠశాల కరస్పాండెంట్ సుధీర్ నాయుడు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందించడం అభినందనీయమన్నారు. అర్హత ఉన్న పిల్లల తల్లిదండ్రులు ముందుకు వచ్చి తమ పిల్లలకు టీకాలు వేయించి సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు సహకరించాలని కోరారు.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రయోజనాలు, వ్యాక్సినేషన్ ప్రాధాన్యతపై సీఓఎంవీ సుబ్బారెడ్డి బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టి.బి. సూపర్‌వైజర్ రాజారత్నం, హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ, వార్డు హెల్త్ సెక్రటరీ ఉదయలక్ష్మి, ఆశా కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



