కడప: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, వివిధ శాఖల పనితీరుపై మంగళవారం కడప కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, వివిధ శాఖల ప్రగతిని శాఖల వారీగా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని వివరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలోని పనుల వివరాలను ప్రజాప్రతినిధులకు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో మౌలిక వసతులు, సాగు, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం తదితర రంగాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలపై సంబంధిత శాఖలు వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిధిమీనా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీఎస్ ముక్తియార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



