Breaking

నియోజకవర్గంలో విద్యుత్ వ్యవస్థ బలోపేతం

రాయచోటి, సెప్టెంబర్ 28 (కలం మనస్సాక్షి ప్రతినిధి) : రాయచోటి నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన, నమ్మకమైన, నిరంతర విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులు, నూతన విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు డీటీఆర్‌ల సరఫరా తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. గాలివీడు మండలం అరవీడు వద్ద రూ.3 కోట్ల వ్యయంతో, రాయచోటి మండలంలోని మార్కెట్ యార్డు వద్ద మరో రూ.3 కోట్ల వ్యయంతో నూతన విద్యుత్ ఉపకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రెండు ఉపకేంద్రాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరగడంతో పాటు అంతరాయాలు తగ్గే అవకాశం ఉందన్నారు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణకు రూ.10 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయని తెలిపారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాత విద్యుత్ మౌలిక వసతులను దృష్టిలో ఉంచుకుని దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు, కేబుల్స్, డీటీఆర్‌లను అవసరమైన ప్రాంతాల్లో మార్చనున్నట్లు వివరించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విషయంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. గత ఎనిమిది నెలల్లో రూ.18 కోట్ల వ్యయంతో 450 వ్యవసాయ డీటీఆర్‌లు జారీ చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఉన్న సీనియారిటీని 2.5 సంవత్సరాల నుంచి ఆరు నెలలకు తగ్గించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరు నెలల సీనియారిటీ ఉన్న వినియోగదారులకు 228 వ్యవసాయ డీటీఆర్‌లు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. నూతన విద్యుత్ ఉపకేంద్రాలు, పట్టణ విద్యుత్ మౌలిక వసతుల ఆధునీకరణ, వ్యవసాయ డీటీఆర్‌ల సరఫరా ద్వారా నియోజకవర్గంలో విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.