పులివెందుల, సెప్టెంబరు 23: డీకేటీ, ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు యాజమాన్య హక్కులు కల్పించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. జెమ్మా కాలనీలు, రాజారెడ్డి కాలనీల్లోని ఇళ్లకు కూడా హక్కులు కల్పించేందుకు కలెక్టర్కు వినతిపత్రం అందించినట్లు టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి తెలిపారు.
ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాటర్ ట్యాక్స్, విద్యుత్ బిల్లులు తదితర ఆధారాలను పరిశీలించి అర్హులను గుర్తించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే సుమారు 4 వేల కుటుంబాలకు ప్రయోజనం కలగడంతో పాటు ఇళ్లపై చట్టబద్ధమైన హక్కులు, బ్యాంకు రుణాలు పొందే అవకాశం లభిస్తుందని బీటెక్ రవి పేర్కొన్నారు.



