ప్రొద్దుటూరు, సెప్టెంబరు 23: 2026 మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల సిబ్బందికి మూడు దశల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే సుమారు 500 మంది పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో 14 మంది మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు, పోలింగ్ ప్రక్రియ, ఎన్నికల సామగ్రి వినియోగం, విధుల నిర్వహణపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది విధులు నిర్వహించేలా శిక్షణ అందించాలని కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సి.టి. కృష్ణసింగ్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జి. చంద్ర మోహన్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.



