పులివెందుల: పట్టణంలోని మారుతి హాల్ రోడ్డులో హిందూ–ముస్లిం సోదరులు కలిసి నిర్వహిస్తున్న గణేష్ చవితి వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. ఏకలవ్య అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో పెనుకొండ తరుణ్ (ఆర్15) చిన్న నేతృత్వంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో బుధవారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి, వేంపల్లె టీడీపీ ఇన్చార్జి అజ్జుగుట్టు రఘునాథరెడ్డి హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా ఖాసీం, ఏకలవ్య అసోసియేషన్ అధ్యక్షుడు తరుణ్, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. మతాలకు అతీతంగా సోదరభావంతో పండుగను నిర్వహించడం స్థానికంగా ఆకట్టుకుంది. రేపు నిర్వహించనున్న గణేష్ శోభాయాత్రలో ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.



