ప్రొద్దుటూరు: గణేష్ నిమజ్జనం సందర్భంగా విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాపాయ స్థితికి చేరిన 17 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి వెంకట సందీప్ ప్రస్తుతం కోలుకుని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సెప్టెంబరు 20న ప్రమాదం జరగడంతో తొలుత ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ఆర్కా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన అనంతరం సందీప్ కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుటుంబానికి సహాయం అందించాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను ఆదేశించారు. కమిషనర్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. చికిత్స సమయంలో కమిషనర్ నిరంతరం వైద్యులతో సంప్రదిస్తూ తమకు అండగా నిలిచారని సందీప్ మేనమామ కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, కమిషనర్‌కు సందీప్ తల్లి పద్మ, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



