ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచించారు. ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో పార్టీ క్యాడర్‌తో సమావేశమైన ఆయన, రాబోయే ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ప్రతి నాయకుడు, కార్యకర్త తమ పరిధిలోని ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేసేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.



