ప్రొద్దుటూరు, సెప్టెంబరు 23: ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల్లో విద్యుత్ సర్వీస్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, చట్టంతో సంఘర్షణ పడిన బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ యు. విభు కృష్ణ వెల్లడించారు.
బుధవారం రూరల్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూరల్ సీఐ ఎం. నాగభూషణ్, ఎస్సై కె.సి. రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిఘా ఏర్పాటు చేసి ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు ఏడాది కాలంగా రాత్రివేళల్లో విద్యుత్ వైర్లను చోరీ చేసి గుజరీ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.
నిందితుల నుంచి రూ.5.40 లక్షల నగదు, 56 కిలోల అల్యూమినియం వైర్లు, 5 కిలోల కాపర్ వైర్లతో పాటు చోరీలకు ఉపయోగించిన ఆటో, ద్విచక్ర వాహనాలు, పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలింపు కొనసాగుతోందని, ఇతర చోరీలతో నిందితులకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.



