ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రొద్దుటూరు పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, నిత్యావసర సరుకులు, తాగునీటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
విద్యుత్ స్తంభాలు, వైర్లను తాకరాదని, చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున సెల్ఫోన్లను ఛార్జింగ్‌లో ఉంచుకోవాలని తెలిపారు. ప్రసవ తేదీ సమీపించిన గర్భిణులు ముందుగానే వైద్య సహాయం పొందాలని కోరారు. వర్షాల నేపథ్యంలో వాటర్‌వర్క్స్, పారిశుధ్య, ఇంజినీరింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశామని, మున్సిపల్ సిబ్బంది ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
డ్రైనేజీలు పొంగిపొర్లినా, రోడ్లపై నీరు నిలిచినా వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సమస్యలు, ఫిర్యాదుల కోసం 9849906669 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచనల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నామని కమిషనర్ వెల్లడించారు.



