ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఈ నెల 25న మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, జాయింట్ కలెక్టర్ నిధి మీనా ఐఏఎస్ అధికారులతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
సమావేశంలో మున్సిపాలిటీకి మంజూరైన నిధులు, వాటి వినియోగం, పట్టణంలో చేపడుతున్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి తదితర అభివృద్ధి పనుల ప్రస్తుత పరిస్థితి, పురోగతిపై సమీక్షించనున్నారు. పనులు ఏ దశలో ఉన్నాయో పరిశీలించడంతో పాటు, పెండింగ్లో ఉన్న పనులు, వాటి పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివిధ శాఖలకు సంబంధించిన పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కార్యక్రమాల అమలు తీరును కూడా సమీక్షించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలోని పనుల పురోగతి, నిధుల వినియోగం, ఇతర వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేయాలని కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు. సమీక్షా సమావేశానికి అవసరమైన సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.



