ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 22: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పూల నజీర్పై దాడి చేసిన నిందితులను చట్టపరంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పోలీసులను కోరారు. మంగళవారం ప్రొద్దుటూరు ఏఎస్పీ విభు కృష్ణను కలిసి ఘటన వివరాలను తెలియజేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గత ఆదివారం ప్రొద్దుటూరులోని రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలోని వై జంక్షన్ వద్ద వ్యాపార సంబంధిత వివాదం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మధ్యవర్తిత్వం చేసేందుకు అక్కడికి వెళ్లిన పూల నజీర్, ఆయన కుమారుడు జావీద్‌పై కొందరు రాళ్లతో దాడి చేయడంతో ఇద్దరికీ తలకు గాయాలయ్యాయని తులసిరెడ్డి ఏఎస్పీకి వివరించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పూల నజీర్, ఆయన కుమారుడు జావీద్, గత ఎన్నికల్లో జమ్మలమడుగు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాముల బ్రహ్మానందరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది జిలాని భాష, ఉత్తన్న, తోపిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, చిన్నకోట్ల నాగరాజు పాల్గొన్నారు.



