ప్రొద్దుటూరు: పట్టణంలో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రైన్లపై అక్రమ కట్టడాలు, ఆక్రమణలతో పాటు కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల వర్షపు నీరు సజావుగా వెళ్లలేకపోతోందని అధికారులు గుర్తించారు. దీంతో డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.
మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుంచే అధికారులు, సిబ్బంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. మురుగు కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు పారిశుధ్య కార్మికులు పనులు చేపట్టారు. వర్షపు నీరు నిలిచిపోకుండా డ్రైన్లను శుభ్రం చేయడంతో పాటు నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించే చర్యలు చేపట్టారు.
డ్రైన్లను ఆక్రమించి అక్రమ కట్టడాలు, బంకులు ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్న యజమానులకు కమిషనర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. డ్రైన్ల ఆక్రమణల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పట్టణంలోని డ్రైన్లపై ఉన్న అక్రమ కట్టడాలు, బంకులను దశలవారీగా తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.



