ప్రొద్దుటూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బుధవారం ప్రొద్దుటూరులో నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్వగృహంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు పూల శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, పి. రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం జారీ చేసిన ఐడీ కార్డుల ప్రాధాన్యతను కార్యకర్తలకు వివరించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, వైఫల్యాలను ప్రజలకు వివరించి వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేస్తున్నారని అభినందించారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



