ప్రొద్దుటూరు: శ్రీనివాసనగర్‌లోని వాసవి పారామెడికల్ కళాశాలలో విద్యార్థులకు ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ రాఘవేంద్ర పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రాఘవేంద్ర మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చెడు స్నేహాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలను పాటించాలని తెలిపారు.
సైబర్ నేరాల పట్ల కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.
అలాగే రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని ఎస్ఐ రాఘవేంద్ర కోరారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసుల దృష్టికి తీసుకువస్తే తగిన సహాయం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



