ప్రొద్దుటూరు: రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడటం సరికాదని మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నానని తెలిపారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, తాను ఎప్పుడూ ఎవరినీ అగౌరవపరిచేలా మాట్లాడలేదన్నారు. బీసీ ఓట్ల రాజకీయంతో తనపై అనవసర ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు.
మున్సిపల్ చైర్మన్ పదవికి పార్టీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే పార్టీలోని ఔత్సాహికులకు అవకాశం కల్పించేందుకు కూడా సిద్ధమేనన్నారు. వైసీపీ చేనేత విభాగం నాయకుడు బండారు సూర్యనారాయణ కుటుంబం పట్ల తనకు గౌరవం ఉందని, తనపై వచ్చిన ఆరోపణలను నమ్మి ఆయన విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ఆరోపణలు నిజమైతే చౌడేశ్వరి అమ్మవారి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గతంలో గ్రామాల్లో జరిగిన ఘర్షణలు, హత్యలకు తమ కుటుంబానికి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, పాత ఘటనలను రాజకీయ విమర్శలకు ఉపయోగించకుండా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
చెన్నమరాజుపల్లె టీడీపీ నాయకుడు రాజువారి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ.. గతంలో రాజువారి, నశ్యం కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇరు కుటుంబాలు సామరస్యంగా ఉంటూ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఇన్చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



