పులివెందుల, సెప్టెంబర్ 3: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని సీఐ పురుషోత్తం రాజు సూచించారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సాయి చైతన్య జూనియర్, చైతన్య డిగ్రీ కళాశాలల్లో మాదక ద్రవ్యాల నిర్మూలన, నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను నాశనం చేస్తోందని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆర్అండ్బీ డీఈఈ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నేత్రదానం ద్వారా మరణానంతరం ఇద్దరికి చూపును అందించే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నేత్రదానానికి సంకల్పించాలని కోరారు. కార్యక్రమంలో సేవాసమితి అధ్యక్షుడు రాజు, కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.



