కడప, సెప్టెంబర్ 3: కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ బి.రాజ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 300 ఓసీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులు చాలాకాలంగా సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు మాత్రం ఉద్యోగ భద్రత లేకపోవడం అన్యాయమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు.
రెగ్యులరైజేషన్ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే జేఏసీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రాజ్‌కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం అధ్యక్షుడు జాసన్‌తో పాటు పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.



