ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 2:
ప్రొద్దుటూరు పట్టణంలో కుళాయి పన్నుల బకాయిల వసూళ్లపై మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సీరియస్ అయ్యారు. బుధవారం వార్డు మౌలిక సౌకర్యాల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షలో పన్నుల వసూళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో 24,146 అధికారిక కుళాయి కనెక్షన్లు ఉండగా, సుమారు రూ.3.24 కోట్ల కుళాయి పన్ను బకాయిలు ఉన్నాయని తెలిపారు.
కుళాయి పన్నులు సకాలంలో వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుళాయి పన్నులు, ఇతర బకాయిలతో కలిపి సుమారు రూ.5 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నందున సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు ప్రత్యేక వసూళ్ల డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. బకాయిలు చెల్లించని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు సకాలంలో కుళాయి పన్నులు చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని కమిషనర్ కోరారు. సమావేశంలో వాటర్ వర్క్స్ ఏఈలు కె.సురేంద్రనాథ్ రెడ్డి, ఎన్.దస్తగిరి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



