ప్రొద్దుటూరు, ఆగస్టు 31: అసాంఘిక కార్యకలాపాల నియంత్రణతో పాటు మహిళల్లో చైతన్యం పెంపొందించేందుకు ప్రొద్దుటూరు ఒకటవ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అక్కదేవతల గుడి వద్ద పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి మహిళలతో సమావేశమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్, గంజాయి, వ్యభిచారం, అక్రమ మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల కలిగే దుష్పరిణామాలపై మహిళలకు అవగాహన కల్పించారు. తమ ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కొండారెడ్డి సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ప్రజలు, మహిళలు పోలీసులకు సహకరిస్తే అసాంఘిక కార్యకలాపాలను అరికట్టి ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చని సీఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసులకు తమ సహకారం అందించారు.



