ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రొద్దుటూరు వ్యాపారులపై రాచమల్లుకు ఉన్నది ప్రేమ కాదని, స్వార్థ ప్రయోజనాలేనని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలను ప్రొద్దుటూరులోకి తీసుకొచ్చింది రాచమల్లేనని ఆరోపించారు.
బీసీ నాయకుడు చల్లా రాజగోపాల్ యాదవ్‌పై గానీ, టీడీపీ కార్యకర్తలపై గానీ చేయి వేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. బీసీలను కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలని, అహంకారం వీడకపోతే రాజకీయ పతనం తప్పదన్నారు. రాచమల్లు తనపై చేసిన వ్యాఖ్యలకు భయపడేది లేదని, ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.
వ్యాపారాల కోసం అప్పులు చేయడం సహజమేనని, అయితే డబ్బులు తీసుకుని ఎగ్గొట్టే చరిత్ర తమది కాదని వరదరాజులరెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళల డబ్బుల వ్యవహారంపైనా రాచమల్లును ప్రశ్నించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



