తాడేపల్లి, ఆగస్టు 31: వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. దాదాపు 30 ఏళ్లుగా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రజలు ఎదురుచూస్తున్న కలను సీఎం చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం, దూరదృష్టితో సాకారం చేశారని తెలిపారు. ఫేజ్-1 ద్వారా కృష్ణా జలాలను విడుదల చేసి నల్లమలసాగర్‌కు 10.7 టీఎంసీల నీటిని అందించడం కీలక మైలురాయిగా పేర్కొన్నారు. వెలిగొండతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు. నిర్వాసిత కుటుంబాలకు 48 రోజుల్లో రూ.762 కోట్ల పరిహారం పంపిణీ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ రైతుల ఆశలు, ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.



