అరకు(గన్నెల)పరిధిలో శనివారం ఏర్పాటు చేసిన ‘సంజీవని’ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడును ఆదివాసి జేఏసీ నాయకులు హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివాసి జేఏసీ రాష్ట్ర చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ తమర్భ బాబూరావు నాయుడు, జేఏసీ అల్లూరి జిల్లా చైర్మన్ రామారావు దొర, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాసాడా ఈశ్వర్ రావుల ఆధ్వర్యంలో గిరిజన నేతలు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి, పలు కీలక ఆదివాసి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి వినతిపత్రం సమర్పించారు.ప్రధాన డిమాండ్లు ఇవే..గిరిజన ప్రాంతాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా:షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం: గిరిజన నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టాన్ని వెంటనే తీసుకురావాలి.1/70 భూ బదలాయింపు చట్టం రక్షణ: 1/70 చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడంతో పాటు, ఈ కేసులో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంప్లీడ్ అయి ఆదివాసులకు న్యాయం చేయాలి.మారికవలస విద్యార్థుల సమస్య: ప్రస్తుతం మారికవలస స్కూల్లో చదువుతున్న ఆదివాసి విద్యార్థులను ఎక్కడికీ మార్చకుండా, అదే పాఠశాలలోనే కొనసాగించాలి.ముఖ్యమంత్రి సానుకూల స్పందన – శాశ్వత పరిష్కారానికి హామీ:ఆదివాసి నేతలు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న జీవో నంబర్ 3ని మళ్ళీ పునరుద్ధరించడం సాధ్యమేనని, అయితే భవిష్యత్తులో సుప్రీంకోర్టులో మళ్లీ చట్టపరమైన చిక్కులు రాకుండా, కేసు కొట్టివేయకుండా ఉండాలంటే గిరిజనులకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అత్యంత బలీయమైన ‘షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం’ తీసుకురావాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సీఎం ఆదివాసి నేతలకు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టపులి శ్రీనివాస్ పడాల్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మణుగూరు బాబుజీ, అనంతగిరి మండల కార్యదర్శి చంటి, అరకు మండల కన్వీనర్ సమర్ధి గోపాల్, కిలో బుద్ధు తదితర ఆదివాసి సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



