ప్రొద్దుటూరు, ఆగస్టు 28: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్థానిక వ్యాపారుల సమస్యలపై మాట్లాడటం రాజకీయ ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇర్ఫాన్ బాషా విమర్శించారు. గతంలో పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రొద్దుటూరులో పలు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటైనప్పుడు స్థానిక వ్యాపారుల ప్రయోజనాల కోసం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
రిలయన్స్, మోర్, బీ-మార్ట్, విశాల్ మార్ట్, సీఎంఆర్ మాల్, డీ-మార్ట్ తదితర సంస్థలు గతంలోనే ప్రొద్దుటూరుకు వచ్చాయని గుర్తుచేశారు. చేనేత కార్మికులు, కూరగాయల మార్కెట్ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి గతంలో ఏం చర్యలు తీసుకున్నారో రాచమల్లు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కొత్తగా హామీలు ఇవ్వడం కాకుండా, గతంలో చేసిన అభివృద్ధిని చూపించి డబ్బులు పంచకుండా ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం ఉందా అని ఇర్ఫాన్ బాషా సవాల్ చేశారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే స్థానిక వ్యాపారులు, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.



