ప్రొద్దుటూరు: సంజీవనగర్‌లోని బాలికల హాస్టల్లో ప్రొద్దుటూరు టూ టౌన్ ఎస్ఐ మహబూబ్ బాషా విద్యార్థినులకు మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు, బాలికలు, చిన్నారులపై జరిగే నేరాలు, వేధింపులు, సైబర్ నేరాలపై విద్యార్థినులకు వివరించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటీపీ, పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు.
ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు. మహిళలు, బాలికల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో టూ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



