ప్రొద్దుటూరు: రహదారిపై ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ట్రాఫిక్ సీఐ భాస్కర్ సూచించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ముఖ్యమైనవని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు. రోడ్డు దాటే సమయంలో జీబ్రా క్రాసింగ్‌ను ఉపయోగించడంతో పాటు ట్రాఫిక్ సిగ్నళ్లను తప్పనిసరిగా పాటించాలన్నారు.
వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ వినియోగించడం ప్రమాదకరమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకుని, వాటిని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేయాలని కోరారు. నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని సీఐ భాస్కర్ పేర్కొన్నారు.



