ప్రొద్దుటూరు: పెద్దశెట్టిపల్లి పరిధిలో అగ్రిగోల్డ్‌కు చెందిన భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంపై సీఐడీ అధికారులు ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు కార్యాలయంలోని సంబంధిత రెవెన్యూ రికార్డులు, భూమి రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించినట్లు సమాచారం.
పెద్దశెట్టిపల్లిలో సుమారు 1.7 ఎకరాల అగ్రిగోల్డ్ భూమి గుద్దేటి జయరాంరెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. భూమికి సంబంధించిన పాత రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ దస్తావేజులను పరిశీలించినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా? లేదా అనే అంశంపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సీఐడీ తనిఖీలు ప్రొద్దుటూరులో చర్చనీయాంశంగా మారాయి.



