ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు దీప్తి జూనియర్ కళాశాలలో మైనర్ డ్రైవింగ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడపడం ప్రమాదకరమని, చట్టవిరుద్ధమని వివరించారు.
మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ఒక్క చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. విద్యార్థులు వాహనాలకు దూరంగా ఉంటూ చదువు, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాతే లైసెన్స్ పొంది వాహనం నడపాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని అవగాహన కల్పించారు.



