వేంపల్లి: పెళ్లి ముహూర్తం సమీపించిన వేళ వధువు ఫోన్ స్విచ్ఆఫ్ చేసి కనిపించకుండా పోవడంతో వేంపల్లిలో ఓ వివాహం నిలిచిపోయిన ఘటన చర్చనీయాంశంగా మారింది. పెళ్లికి వారం రోజుల ముందు నుంచే ఇరు కుటుంబాలు వివాహ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. పెళ్లికూతురు, పెళ్లికొడుకు కలిసి సుమారు రూ.1.50 లక్షల విలువైన దుస్తులు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసినట్లు యువకుడు పోలీసులకు తెలిపాడు.
అయితే పెళ్లి రోజు యువతి ఫోన్ స్విచ్ఆఫ్ చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం యువతి పంపిన సందేశంలో.. ‘‘నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతానంటోంది’’ అని పేర్కొన్నట్లు యువకుడు తెలిపాడు. తనను నమ్మించి వివాహం పేరుతో సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేయించిందని ఆరోపిస్తూ యువకుడు వేంపల్లి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సదరు యువతికి గతంలోనూ రెండు పెళ్లిళ్లకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి యువకుడి ఫిర్యాదును స్వీకరించిన వేంపల్లి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ, గతంలో జరిగిన వివాహ సంబంధిత వ్యవహారాలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.



