వేంపల్లి, ఆగస్టు 21: రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా పెండింగ్‌లో ఉన్న విభజన హామీలను దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అభినందించారు. మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ధైర్యంగా ప్రస్తావించడం హర్షణీయమన్నారు.
ప్రత్యేక హోదా, రాయలసీమ–ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ, కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజుపట్నం పోర్టు, మెట్రో రైలు, విమానాశ్రయాల అభివృద్ధి తదితర విభజన హామీలు ఇంకా పరిష్కారం కాలేదని తులసిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన కోరారు.



