ప్రొద్దుటూరు: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా శ్రీనివాసనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రాజీవ్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. గీత మాట్లాడుతూ దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



