పులివెందుల, ఆగస్టు 19: రైల్వే, ఇన్ఫోసిస్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన రెండు కేసుల్లో ఇద్దరు నిందితులను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, పులివెందుల ఎస్డీపీఓ బి. మురళి పర్యవేక్షణలో యూజీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. శ్రీరామ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు ఎం. మధుసూదన్ రెడ్డి, ఎల్. తిమోతి సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 18న కనంపల్లి, కదిరి చెక్‌పోస్టుల వద్ద నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో నామల జన ప్రకాష్ రావును, రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి రూ.2 లక్షలు వసూలు చేసిన కేసులో క్రిష్ణయ్య మహేష్ @ వీరస్వామి క్రిష్ణను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితుల నుంచి రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ పులివెందుల న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే వ్యక్తులను నమ్మవద్దని పోలీసులు సూచించారు. “డబ్బులు ఇస్తే ఉద్యోగం ఖాయం” అనే మాటలను నమ్మి మోసపోవద్దని, అనుమానాస్పద వ్యవహారాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.



