ప్రొద్దుటూరు, ఆగస్టు 19: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులోని శ్రీ విద్య జూనియర్ కళాశాల, సెయింట్ జోసెఫ్ స్కూల్, ఎస్సీఎన్ఆర్ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించి ప్రతిజ్ఞ చేయించారు.
ఓంశాంతి భవన్ నిర్వాహకులు బీకే శాంత మాట్లాడుతూ యువత డ్రగ్స్, మద్యం, సిగరెట్లు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. బీకే సౌజన్య విద్యార్థులతో రాజయోగ ధ్యానం చేయించి స్వీయ నియంత్రణ, మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రామమోహన్, రాజయోగ ట్రైనర్ వాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బ్రహ్మకుమారీస్ సభ్యులు పాల్గొన్నారు.



