ప్రొద్దుటూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ట్రాఫిక్ సీఐ భాస్కర్ తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మైదుకూరు రోడ్డు నుంచి రాజీవ్ సర్కిల్ వరకు హోండా షోరూమ్ సిబ్బందితో కలిసి ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐ భాస్కర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకుండా రహదారిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని, చిన్న వయసులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర్, సిబ్బంది, హోండా షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సహకరించిన హోండా షోరూమ్ సిబ్బందికి ట్రాఫిక్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.



