కడప: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం (ఏఐకేఎస్) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి భాస్కర్ మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శ్రీశైలం నుంచి కేసీ కెనాల్‌తో పాటు ఇతర ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేయాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ నిధిని రూ.50 వేలకు పెంపు, విత్తనాలు, ఎరువులు, డీజిల్‌ను సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు.



