కడప: కడప నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ‘కడప ప్రజాగర్జన’ కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి అర్హులైన పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలాలు, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై అర్జీలను కార్పొరేషన్ అదనపు కమిషనర్ రాకేష్ చంద్రకు అందజేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని గాలి చంద్ర తెలిపారు.



