తిరుమల: భక్తులను మోసగిస్తూ వసతి గదులను అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న దళారీ ముఠా వ్యవహారాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొందేందుకు ప్రయత్నించిన కేరళకు చెందిన ఆషిక్ అలీ పి.ఎం. (32)ను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద రెండు నకిలీ ఆధార్ కార్డులు, గది రిజిస్ట్రేషన్ స్లిప్, రూ.800 నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రంజిత్ అనే దళారి సూచనలతో ఒక్కో గదికి రూ.1,000 తీసుకుని నకిలీ గుర్తింపు పత్రాలతో గదులు పొందుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై తిరుమల-2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, ముఠాలోని ఇతర సభ్యుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
భక్తులు దళారులను నమ్మకుండా టీటీడీ అధికారిక కౌంటర్లు, వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారానే వసతి పొందాలని అధికారులు సూచించారు. అనుమానాస్పదంగా దళారులు కనిపిస్తే టీటీడీ విజిలెన్స్ కంట్రోల్ రూమ్ 9866898630 లేదా కాల్ సెంటర్ 155257కు సమాచారం ఇవ్వాలని కోరారు.



